Stalin: రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన స్టాలిన్!
- కరోనా కట్టడి కోసం కమిటీని ఏర్పాటు చేసిన స్టాలిన్
- 13 మందితో కమిటీ నియామకం
- కమిటీలో డీఎంకే నుంచి ఒక్క నేతకే ప్రాతినిధ్యం
కేంద్ర ప్రభుత్వాలతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయనే విషయంపై అందరికీ అవగాహన ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే వివిధ కమిటీల్లో సొంత పార్టీ నేతలనే వారు పెట్టుకుంటుంటారు. విపక్ష పార్టీ నేతలకు కమిటీల్లో పొరపాటున కూడా అవకాశం ఇవ్వరు. అయితే, ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతను చేపట్టిన స్టాలిన్... ఈ పద్ధతికి ముగింపు పలికారు. అందరినీ ఆకట్టుకునేలా కొత్త సంప్రదాయానికి తెరతీశారు.
వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో భాగంగా స్టాలిన్ ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. 13 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో... ఏకంగా 12 మంది ప్రతిపక్ష పార్టీల నేతలకు స్టాలిన్ స్థానం కల్పించారు.
ఈ కమిటీకి స్టాలిన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఈ కమిటీ సమీక్షలు జరుపుతూ, ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తుంది. ఈ కమిటీలో ఉన్న సభ్యులు వీరే. డాక్టర్ ఎజిలన్ (డీఎంకే), డాక్టర్ విజయభాస్కర్ (ఏఐఏడీఎంకే), జీకే మణి (పీఎంకే), ఎస్ఎస్ బాలాజీ (వీసీకే), టీ రామచంద్రన్ (సీపీఐ), నాగై మాలి (సీపీఎం), డాక్టర్ జవహరుల్లా (ఎంఎంకే), ఏఎం మణిరత్నం (కాంగ్రెస్), నగర్ నాగేంద్రన్ (బీజేపీ), సుశాన్ తిరుమలై కుమార్ (ఎండీఎంకే), ఆర్ ఈశ్వరన్ (కేఎండీకే), టి.వేల్మురుగన్ (టీవీకే), పూవై జగన్ మూర్తి (పీబీ).
మరోవైపు, స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వైరం అత్యధికంగా ఉండే రాష్ట్రంలో స్టాలిన్ కొత్త ఒరవడికి నాంది పలికారని అంటున్నారు.