Pakistan: పాకిస్థాన్ లో పోలీస్ స్టేషన్ పై దాడి.. పరుగులు తీసిన పోలీసులు!

Police station in Pakistan attacked by mob

  • మహమ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి
  • పోలీస్ స్టేషన్ ను ధ్వంసం చేసిన వందలాది మంది
  • గంట తర్వాత కానీ అదుపులోకి రాని పరిస్థితి

పాకిస్థాన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వందల సంఖ్యలో జనాలు దాడి చేశారు. ఇస్లామాబాద్ లోని గోర్లా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 మరోవైపు అతని వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన కొందరు ప్రజలు ఆ వ్యక్తి కోసం అన్ని చోట్ల వెతికారు. అతను కనిపించకపోయే సరికి ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేశారు. స్టేషన్లో ఆ వ్యక్తి కనపడకపోయేసరికి పోలీసులపై తిరగబడ్డారు. స్టేషన్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. తీవ్ర భయాందోళనలకు గురైన పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న కౌంటర్ టెర్రరిజం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ రియోట్స్ యూనిట్ల నుంచి వందల సంఖ్యలో బలగాలు వెంటనే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. గంట తర్వాత కానీ అక్కడి పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే, సదరు వ్యక్తిని పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టు సమాచారం. దైవ దూషణకు దిగే వారిపై పాకిస్థాన్ లో కఠినమైన శిక్షలు ఉంటాయి. మహమ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లడిన 29 మందికి 2019లో మరణశిక్షలు విధించారు. ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు.

  • Loading...

More Telugu News