TDP: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నాం: అచ్చెన్నాయుడు ప్రకటన

TDP says they boycott AP assembly budget sessions
  • ఏపీలో ఎల్లుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • ఒక్కరోజు సమావేశాలు సరికాదన్న అచ్చెన్న
  • ఇప్పుడు కరోనా లేదా? అంటూ వ్యాఖ్యలు
  • తాము మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని వెల్లడి
ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ కీలక ప్రకటన చేసింది. ఎల్లుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మార్చిలోనే కేంద్రం సహా అనేక రాష్ట్రాలు సభా సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ ఆమోదించుకుంటే, కరోనా ఉందని చెప్పి జగన్ అసెంబ్లీ సమావేశాలు జరపలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. "మరిప్పుడు కరోనా లేదా? ఏ విధంగా ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు జరుపుతారు?" అని నిలదీశారు.

కరోనా విషయంలో ఒక్కసారైనా అఖిలపక్షం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజన్ అందక రాష్ట్రంలో 106 మంది మరణించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. "కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు ఇస్తామనే చేతకాని ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది. అందుకు నిరసనగా మేం శాసనసభ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నాం" అని వెల్లడించారు. కేవలం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు జరపడం మంచి పద్ధతి కాదని అన్నారు.

అయితే, ఎల్లుండి అసెంబ్లీ ఎన్ని గంటలకు సమావేశమవుతుందో, తాము కూడా అన్ని గంటలకే జూమ్ యాప్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని తెలిపారు.
TDP
AP Assembly Session
Boycott
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News