Suvendu Adhikari: సువేందు అధికారిని విచారించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్న సీబీఐ
- నారద కేసులో సువేందును విచారించేందుకు సిద్ధమైన సీబీఐ
- ఇప్పటికే ఇద్దరు టీఎంసీ మంత్రులు, ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ
- బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందన్న టీఎంసీ
నారద కేసులో పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిని విచారించేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది. ఆయనను విచారించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. నారద స్టింగ్ ఆపరేషన్ జరిగిన సమయంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రత ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్ మిత్రాలను సోమవారం సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిని విచారించేందుకు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఇటీవలే అనుమతిని ఇచ్చారు.
ఈ అరెస్టుల నేపథ్యంలో టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ, సువేందు అధికారి, ముకుల్ రాయ్ లు బీజేపీలో చేరడంతో సీబీఐ వారిని విచారించడం లేదని ఆరోపించారు. అయితే తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అసలైన దోషులు త్వరలోనే బయటపడతారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ మండిపడ్డారు.
2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ ను నారద న్యూస్ పోర్టల్ ఎడిటర్ మ్యాథ్యూ శామ్యూల్ నిర్వహించారు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన విషయాలపై విచారణ జరపాలని 2017 మార్చిలో సీబీఐని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. తాజాగా శామ్యూల్ మాట్లాడుతూ, కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని భావిస్తున్నానని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.