Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం... నైరుతి ఆగమనానికి తోడ్పడుతుందన్న వాతావరణ శాఖ
- ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- తుపానుగా మారుతుందన్న ఐఎండీ
- ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
- ఈ నెల 21న అండమాన్ లోకి రుతుపవనాలు
- ఈ నెల 31న కేరళను తాకే అవకాశం
ఈ ఏడాది రుతుపవనాల సీజన్ ప్రారంభానికి ముందు అన్నీ శుభపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను నైరుతి రుతుపవనాల సీజన్ కు మార్గం సుగమం చేయగా, ఈ నెల 23న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాలు సకాలంలో వచ్చేందుకు దోహదపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరింత బలపడి తుపానుగా మారుతుందని, ఏపీకి 300 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాక దిశ మార్చుకుంటుందని పేర్కొంది. ఇది పశ్చిమ బెంగాల్/బర్మాలో తీరం దాటే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
ఇక, ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనుండగా, ఈ నెల 21నే అండమాన్ సముద్రంలో ప్రవేశించనున్నాయి. కేరళను తాకడానికి ముందే రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ వర్గాలు తెలిపాయి.