West Bengal: మమతా బెనర్జీ సమక్షంలో భయోత్పాతాన్ని సృష్టించారు: కలకత్తా హైకోర్టులో సీబీఐ
- ఆమె రెచ్చగొట్టడం వల్లే దుండగుల రభస అని వెల్లడి
- అందుకే ఆ రోజు కోర్టుకు రాలేకపోయామని వివరణ
- కేసును రాష్ట్రం వెలుపలికి బదిలీచేయాలని విజ్ఞప్తి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వల్లే సీబీఐ కోల్ కతా కార్యాలయంపై తృణమూల్ పార్టీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని కలకత్తా హైకోర్టుకు సీబీఐ వివరించింది. రాష్ట్రం వెలుపల విచారించేలా కేసు బదిలీకి అనుమతివ్వాలని, అరెస్టయిన నలుగురు నిందితులనూ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది.
నారదా టేపుల కేసులో ఇద్దరు మంత్రులు సహా నలుగురిని మొన్న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో, వెంటనే సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. దాంతో నిందితుల బెయిల్ విషయాన్ని హైకోర్టు నిలుపుదల చేసింది.
దీనికి సంబంధించిన కేసును ఇవ్వాళ కోర్టు విచారించింది. సీబీఐ ఆఫీసు ముందు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని తృణమూల్ కార్యకర్తలు భయోత్పాతం సృష్టించడం వల్లే సోమవారం కోర్టుకు వచ్చి నిందితుల కస్టడీని కోరలేకపోయామని సీబీఐ వివరించింది. భారీ గుంపులను తీసుకొని వచ్చిన మమత.. సీబీఐ ఆఫీసు ముందు నానా రచ్చ చేశారని ఆరోపించింది. ఆమె రెచ్చగొట్టడం వల్లే వేలాది మంది దుండగులు సీబీఐ ఆఫీసుపైకి రాళ్లు విసిరారని పేర్కొంది.
సీబీఐ అధికారులను బెదిరించి, భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించింది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా మమత సర్కార్ అడ్డుకుంటోందని ఆక్షేపించింది. అలాంటి సందర్భంలో నిందితులను కోర్టుకు తీసుకొస్తే.. దారి మధ్యలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తొచ్చన్న ఉద్దేశంతోనే కోర్టుకు రాలేదని పేర్కొంది.