Sania Mirza: సానియా మీర్జా కుమారుడికి వీసా ఇవ్వండి... బ్రిటన్ ను సంప్రదించిన కేంద్ర క్రీడల శాఖ
- వచ్చే నెల నుంచి సానియా బ్రిటన్ టూర్
- వింబుల్డన్ సహా పలు టోర్నీలు ఆడనున్న సానియా
- కుమారుడ్ని కూడా వెంట తీసుకెళ్లాలని నిర్ణయం
- కేంద్రానికి విజ్ఞప్తి.. ప్రయత్నాలు ప్రారంభించిన కేంద్రం
భారత టెన్నిస్ రారాణి సానియా మీర్జా త్వరలోనే బ్రిటన్ లో పలు టోర్నమెంట్లలో పాల్గొననుంది. ఆ టోర్నీల్లో ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ కూడా ఉంది. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే ముందు బ్రిటన్ లో టోర్నీలు ఆడడం ద్వారా ప్రాక్టీసు అవుతుందని సానియా భావిస్తోంది.
అయితే, బ్రిటన్ టూర్ సుదీర్ఘ సమయం సాగనుండడంతో తన వెంట రెండేళ్ల వయసున్న కుమారుడు ఇజాన్ ను కూడా తీసుకెళ్లాలని సానియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో, సానియా కుమారుడికి కూడా వీసా ఇప్పించేందుకు కేంద్ర క్రీడల శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాయంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. సానియా కుమారుడికి కూడా వీసా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
జూన్ 6న నాటింగ్ హామ్ ఓపెన్, జూన్ 14న బర్మింగ్ హామ్ ఓపెన్, జూన్ 20న ఈస్ట్ బోర్న్ ఓపెన్, చివరగా జూన్ 28న వింబుల్డన్ టోర్నీ జరగనున్నాయి. ఈ టోర్నీల్లో పాల్గొంటున్న సానియాకు ఇప్పటికే వీసా లభించింది. అయితే కుమారుడికి, కేర్ టేకర్ కు మాత్రం ఇంకా వీసా లభించలేదు. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ తీవ్ర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.