Ambati Rambabu: సత్తెనపల్లి నియోజకవర్గంలోని 'సేఫ్ పేరెంటల్స్' సంస్థకు రెమ్ డెసివిర్ తయారీ అనుమతి లభించింది: అంబటి
- కరోనా చికిత్సలో రెమ్ డెసివిర్ కు ప్రాధాన్యత
- దేశంలో విపరీతమైన డిమాండ్
- దేశీయంగా తయారీకి కేంద్రం అనుమతి
- సేఫ్ పేరెంటల్స్ కు అనుమతి పట్ల అంబటి సంతోషం
- సీఎం జగన్, లావు శ్రీకృష్ణదేవరాయలుకు అభినందనలు
అంతర్జాతీయంగా కరోనా చికిత్సలో రెమ్ డెసివిర్ ఔషధానికి విపరీతమైన డిమాండు ఉంది. గిలీడ్ లైఫ్ సైన్సెస్ ఫార్మా సంస్థ ఇచ్చిన వాలంటరీ లైసెన్స్ కింద భారత్ లోనూ రెమ్ డెసివిర్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలోని సుప్రసిద్ధ ఫార్మా సంస్థలు ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, తాజాగా మరికొన్ని ఫార్మా సంస్థలకు కూడా రెమ్ డెసివిర్ తయారీ అనుమతులు లభించాయి.
ఏపీలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని 'సేఫ్ పేరెంటల్స్' ఫార్మా సంస్థకు కూడా రెమ్ డెసివిర్ తయారీ అనుమతులు లభించినట్టు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. సేఫ్ పేరెంటల్స్ సంస్థకు కీలక అనుమతులు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. దీనికోసం ప్రయత్నం చేసిన సీఎం జగన్ కు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు అంబటి ట్వీట్ చేశారు.