Nellore District: కరోనా భయంతో అడవిలోకి వెళ్లిపోయిన 70 మంది గిరిజనులు.. అధికారుల అభయంతో తిరిగి ఇళ్లకు!

70 tribals who went to the forest for fear of corona in Nellore dist

  • నెల్లూరు జిల్లా వెంకటగిరి బొగ్గులమిట్టకు చెందిన గిరిజనులు 
  • కోన మల్లేశ్వరస్వామి కోనకు తరలిపోయిన 10 గిరిజన కుటుంబాలు
  • విషయం తెలిసి కోనకు వెళ్లి గిరిజనులతో మాట్లాడిన ఏపీపీ

కరోనా మహమ్మారి భయంతో అడవిలోకి వెళ్లిపోయిన కుటుంబాలు అధికారుల అభయంతో తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు అంగీకరించాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిందీ ఘటన. కరోనా కాటేస్తుందన్న భయంతో  వెంకటగిరి బొగ్గులమిట్టకు చెందిన 10 గిరిజన కుటుంబాలు వెలిగొండ అటవీ ప్రాంతంలోని కోన మల్లేశ్వరస్వామి కోనకు వెళ్లిపోయాయి. వీరిలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు కలిసి దాదాపు 70 మంది వరకు ఉన్నారు.

సమాచారం అందుకున్న నెల్లూరు కోర్టుకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) కేజే ప్రకృతికుమార్ నిన్న అడవిలోకి వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తమ భయాన్ని వ్యక్తం చేశారు. కరోనా భయంతో నాలుగు రోజులకు సరిపడా ఆహార పదార్థాలను వెంటతెచ్చుకున్నామని, అయితే, అవి రెండు రోజులకే అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో, ఎవరికీ ఎలాంటి భయమూ అక్కర్లేదని, అందరూ తిరిగి ఇళ్లకు వెళ్లాలంటూ ఏపీపీ వారిలో ధైర్యం నింపారు. అడవికి రావడం ప్రమాదకరమని, ఇళ్లకు వెళ్తే ఆహార పదార్థాలను తామే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు అంగీకరించారు.

  • Loading...

More Telugu News