exams: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల
- కరోనా విజృంభణతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు
- విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులుగా ఇప్పటికే ప్రకటన
- ఫార్మేటివ్ అసెస్మెంట్-1లో వచ్చిన మార్కుల ఆధారంగా మార్కులు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను రేపు విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కొన్ని నెలల క్రితం వారి పాఠశాలల్లో నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్మెంట్-1లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మార్కులు ఇవ్వనున్నారు.
ఆ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఐదింతలు చేసి (20 శాతం మార్కులను 100 శాతానికి పెంచుతూ) గ్రేడ్లు ఇవ్వనున్నారు. విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్ ను నిర్ణయిస్తారు.
రాష్ట్రంలోని 5.21 లక్షల మంది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, వారికి వేయాల్సిన మార్కుల కోసమే ఫార్మేటివ్ అసెస్మెంట్-1ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.