Black Fungus: బ్లాక్ ఫంగస్ ను ఇలా గుర్తించండి.. ఎయిమ్స్ మార్గదర్శకాలు
- కేసులు, మరణాలు పెరుగుతుండడంతో చర్యలు
- ముక్కులో నల్లటి పక్కులు, రక్తం కారడం
- నమల్లేకపోవడం, దంతాలు ఊడడం
- లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచన
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. దానితో ఎక్కువమంది బలవుతున్నారు. దానిని ఆరంభంలోనే గుర్తించడం కొంత కష్టమైపోతోంది. అది ఉందని తెలిసేలోపు జరగరాని నష్టం జరిగిపోతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే 90 మంది దాకా దానికి బలయ్యారు. రాజస్థాన్, గుజరాత్, తెలంగాణ, హర్యానా, ఢిల్లీ, ఏపీల్లోనూ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆరంభంలోనే దానిని ఎలా గుర్తించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఢిల్లీ ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇలా గుర్తించాలి.. ఇవీ లక్షణాలు..
- ముక్కులో నల్లటి పక్కులు రావడం, ముక్కు నుంచి రక్తం కారడం.
- ముక్కులు మూసుకుపోయినట్టనిపించడం, తలనొప్పి, కంటినొప్పి. కళ్ల చుట్టూ వాపు, ఏవైనా రెండుగా కనిపించడం, కళ్లు ఎరుపెక్కడం, చూపు మందగించడం, కళ్లు తెరిచి మూయలేకపోవడం.
- మొహం మొద్దుబారినట్టుండడం, తిమ్మిర్లు.
- నమల్లేకపోవడం, నోరు తెరవలేకపోవడం.
- దంతాలు ఊడిపోవడం, నోట్లో వాపు రావడం.
ఏం చేయాలి?
- లక్షణాలు కనిపించగానే వెంటనే ఈఎన్టీ, కంటి వైద్యులను సంప్రదించాలి.
- ఎప్పటికప్పుడు దానిపై వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. చికిత్స తీసుకోవాలి. మధుమేహులు చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి.
- ఇతర జబ్బులున్న వారు తమ ఔషధాలతో పాటు బ్లాక్ ఫంగస్ ఔషధాలను వాడాలి.
- స్టెరాయిడ్లు, యాంటీ బయాటిక్స్, యాంటీ ఫంగల్ ఔషధాలను ఇష్టమొచ్చినట్టు వాడకూడదు.
- వైద్యుల సలహా మేరకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ద్వారా పారానాజల్ సైనస్ స్కాన్లు చేయించాలి.
వీరికి ముప్పు ఎక్కువ..
- అనియంత్రిత మధుమేహం ఉన్న వారు, స్టెరాయిడ్లు, టొసిలిజుమాబ్ వంటి మందులు వాడే మధుమేహులు.
- రోగనిరోధక వ్యవస్థను నియంత్రించే ఔషధాలు వాడే వారు, కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్న వారు, అత్యంత బలహీనులు.
- ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్న కరోనా బాధితులు.