West Bengal: ఎంత అవమానం.. ప్రధాని మమ్మల్ని మాట్లాడనివ్వలేదు: మమత ఆరోపణ
- సమావేశానికి పిలిచీ మాట్లాడలేదని ఆరోపణ
- వ్యాక్సిన్లు, రెమ్ డెసివిర్ మందులపై ఊసే లేదు
- బ్లాక్ ఫంగస్ కేసులపైనా చర్చే లేదని విమర్శ
- మోదీకి అభద్రత భావం ఎక్కువని మండిపాటు
సమావేశానికి పిలిచి అవమానించారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానిపై మరోసారి ఆరోపించారు. కరోనా కట్టడి వ్యూహాలపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. అందులో కొన్ని రాష్ట్రాల సీఎంలూ పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశంలో ప్రధాని, కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప వేరే రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆరోపించారు.
తమను సమావేశానికి రమ్మని పిలిచి కూడా తమతో మాట్లాడలేదని, తమను మాట్లాడనివ్వలేదని అన్నారు. అది తమకు అవమానభారంగా ఉందన్నారు. సమావేశంలో భాగంగా వ్యాక్సిన్ల గురించిగానీ, రెమ్ డెసివిర్ మందులపైగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించీ వివరాలు అడగలేదన్నారు.
తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు తగ్గాయన్నారని, కానీ, ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు. ప్రధాని మోదీకి అభద్రతా భావం ఎక్కువని, అందుకే తమ మాటలను ఆయన వినట్లేదని మండిపడ్డారు.