U. Vishweshwara Rao: ప్రముఖ దర్శక నిర్మాత యు.విశ్వేశ్వరరావు మృతి
- 'కంచుకోట', 'దేశోద్ధారకులు', 'పెత్తందార్లు' చిత్రాల నిర్మాణం
- త్ర్రాపు చిత్రంతో దర్శకుడిలాగా మారిన వైనం
- దివంగత ఎన్టీ రామారావుకి వియ్యంకుడు
అలనాటి దర్శక నిర్మాతలలో ఒకరైన యు.విశ్వేశ్వర రావు, ఈ రోజు ఉదయం చెన్నైలో మరణించారు. కరోనా బారిన పడిన ఆయన, ఈ రోజున చివరి శ్వాసను వదిలారు. ఎన్టీ రామారావుకి ఆయన వియ్యంకులు అవుతారు. విశ్వేశ్వరరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. మొదటి నుంచి కూడా ఆయనకి నటన పట్ల .. రచన పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. నటన .. నాటకాల పట్ల ఆయనకి గల ఆసక్తినే సినిమాల దిశగా నడిపించింది. 'కంచుకోట' .. 'దేశోద్ధారకులు' .. 'పెత్తందార్లు' .. సినిమాలకి ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
'తీర్పు' చిత్రంతో దర్శకుడిగా మారి.. 'మార్పు', 'నగ్న సత్యం' .. 'కీర్తి కాంత కనకం' .. 'హరిశ్చంద్రుడు' సినిమాలకి ఆయన దర్శకత్వం వహించారు. 'కీర్తి కాంత కనకం' .. 'పెళ్లిళ్ల చదరంగం' సినిమాలు ఆయనకి 'నంది' బహుమతులు తెచ్చిపెట్టాయి. ఇక 'దేశోద్ధారకులు' సినిమాలో ఆయన రాసిన 'ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు' అనే పాట అప్పట్లో బాగా పాప్యులర్ అయింది.
17వ నేషనల్ అవార్డు సెంట్రల్ జ్యూరీ సభ్యుడిగా ఉండటమే కాకుండా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి బాధ్యతను కూడా ఆయన నిర్వహించారు. ఇండస్ట్రీలో మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతి పట్ల, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.