Bombay High Court: 12 గంటల పాటు ఏకధాటిగా పనిచేసిన బాంబే హైకోర్టు.. 80 కేసులు విన్న ప్రత్యేక ధర్మాసనం
- భోజనం విరామం కూడా లేకుండా కేసులు విన్న ధర్మాసనం
- మధ్యలో స్వల్ప టీ బ్రేక్
- ఉదయం 10.45 నుంచి రాత్రి 11.15 గంటల వరకు విచారణలు
బాంబే హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం నిన్న రికార్డుస్థాయిలో 12 గంటలపాటు ఏకధాటిగా పనిచేసింది. ఈ క్రమంలో 80 కేసులను విచారించింది. న్యాయమూర్తులు భోజన విరామం కూడా తీసుకోకుండా వర్చువల్ విధానంలో 80 కేసులకు సంబంధించి వాదనలు విన్నారు. ఉదయం 10.45 గంటలకు విచారణను ప్రారంభించిన జస్టిస్ ఏజే కథావాలా, జస్టిస్ ఎస్‌పీ తావ్డేలతో కూడిన ధర్మాసనం రాత్రి 11.15 గంటల వరకు విచారణలు కొనసాగించింది.
భోజన విరామం కూడా తీసుకోని న్యాయమూర్తులు మధ్యలో మాత్రం టీ బ్రేక్ ఇచ్చారు. జస్టిస్ కథావాలా గతంలోనూ ఇలానే సుదీర్ఘంగా విచారణలు కొనసాగించారు. 2018 మేలో వేసవి సెలవులకు ముందురోజు తెల్లవారుజామున 3.30 గంటల వరకు 120 కేసుల్లో వాదనలు విన్నారు. ఇక, నిన్న విచారించిన కేసుల్లో ఎల్గార్ పరిషత్ నిందితుల బెయిల్, చికిత్స, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసు వంటి ముఖ్యమైన కేసులు ఉన్నాయి.