Corona Virus: కరోనా వైరస్ చైనా వైరాలజీ ల్యాబ్‌లో పుట్టిందే: బ్రిటన్ సైన్స్ రచయిత వాదన

British science writer raises questions on origin of COVID
  • వైరస్ పుట్టుక విషయంలో రెండు సిద్ధాంతాలు
  • ల్యాబ్ నుంచి లీకైందన్న సిద్ధాంతమే ప్రచారంలో ఉంది
  • వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చేసి మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించేలా తీర్చిదిద్దారు
  • వూహాన్‌లో పుట్టి ఉంటే బయటకు రావడంలో ఆశ్చర్యం లేదు
  • బ్రిటన్ రచయిత  నికోలస్ వేడ్
కరోనా వైరస్ వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనే పురుడుపోసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సైన్స్ రచయిత నికోలస్ వేడ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మానవ కాణాల్లోను, మానవ జన్యువులు కలిగిన ఎలుకల్లోనూ కరోనా వైరస్‌లు ఇన్ఫెక్షన్లు కలిగించేలా వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసినట్టు వేడ్ రాసిన ఓ వ్యాసం సర్వత్ర చర్చనీయాంశమైంది.

కరోనా వైరస్ మూలాల గురించి ఆయన ఎన్నో ప్రశ్నలు సంధించారు. కరోనా వైరస్ ల్యాబ్‌లోనే పురుడుపోసుకుందని చెప్పడానికి ప్రాతిపదిక ఉందని వేడ్ తన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే, వాటికి సంబంధించిన రికార్డులు మాత్రం లేవన్నారు. కరోనా మూలాలకు సంబంధించి రెండు సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయని, అందులో ఒకటి సహజ సిద్ధంగా వన్యప్రాణుల నుంచి మానవుల్లోకి చేరడం అయితే, రెండోది వైరస్‌పై ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వ్యాప్తి చెందడమని వివరించారు.

అయితే, ఇది సహజ సిద్ధంగా వ్యాప్తి చెందిందనే దానికన్నా ల్యాబ్ నుంచి లీకేజీ అయిందని చెప్పే వారే ఎక్కువున్నారు.  దీనికి కారణాన్ని కూడా ఆయన తన వ్యాసంలో రాసుకొచ్చారు. వూహాన్‌లో ఎప్పటి నుంచే వివిధ రకాల కరోనా వైరస్‌లపై పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. అక్కడి ప్రయోగాల్లో గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లో జన్యుమార్పులు చేయడం ద్వారా మానవుల్లో ఇన్ఫెక్షన్‌ కలిగించేలా ప్రయోగాలు చేశారన్నారు.

ఇందుకోసం టెస్ట్ ట్యూబ్‌లో, జంతువుల్లో ప్రయోగాలు చేపట్టారని పేర్కొన్నారు. క్రమంగా వైరస్ రూపాంతరం చెంది మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే స్థాయికి చేరిందని వేడ్ రాసుకొచ్చారు. వైరస్‌ను అయితే అభివృద్ధి చేశారు కానీ దాని నుంచి రక్షణ కోసం టీకాలను మాత్రం తయారు చేయలేదన్నారు. పైగా ఆ ల్యాబ్‌లో భద్రతా ప్రమాణాలను కూడా పాటించలేదన్నారు. ప్రమాదకరమైన వైరస్ అక్కడ అభివృద్ధి చెంది ఉంటే అక్కడి నుంచి అది బయటకు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదని వేడ్ అభిప్రాయపడ్డారు.
Corona Virus
Wuhan
China
Virology Lab
British Science writer

More Telugu News