Oxford University: ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారత విద్యార్థిని ఘన విజయం
- భారత సంతతి విద్యార్థి అన్వీ భుటానీ జయభేరి
- అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన 11 మంది
- భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి జరిగిన ఉప ఎన్నికలో భారత సంతతి విద్యార్థిని అన్వీ భుటానీ ఘన విజయం సాధించారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఈ ఎన్నికలు జరిగాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో భారత విద్యార్థిని రష్మీ సమంత్ గెలుపొందారు. అయితే, సోషల్ మీడియాలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో, విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలు జరిగాయి.
తాజా ఎన్నికల్లో 11 మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఈ స్థాయిలో పోటీ పడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అయినప్పటికీ అన్వీ భుటానీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అన్వీ ప్రస్తుతం యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న మ్యాగ్ డాలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్సెస్ లో పీజీ చదువుతున్నారు. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.