Vijay Sai Reddy: పచ్చ నేతలే స్పీకర్, మంత్రులట.. ఈ డ్రామాలో లోకేశంకి ఏ మంత్రి పదవిచ్చాడో బాబు?: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- టీడీపీ నేతల మాక్ అసెంబ్లీపై విమర్శలు
- అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది
- అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు
- ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ నేతలు మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఈ మాక్ అసెంబ్లీలో టీడీపీ నేత లోకేశ్‌కి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ మంత్రి పదవి ఇచ్చాడో అంటూ ఎద్దేవా చేశారు.
'ఏమి నాటకాలయ్యా చంద్రం! అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ - మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?' అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగు డ్రామా పార్టీ జబర్దస్త్ షో అంటూ ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.
కాగా, అసెంబ్లీలో ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మాట నిలబెట్టుకుందని విజయసాయిరెడ్డి అన్నారు. 'హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం - సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు...అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది' అని విజయసాయిరెడ్డి అన్నారు.