Black Fungus: బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్.. 5,500కు చేరిన మొత్తం కేసులు
- కరోనా సమయంలో విజృంభిస్తున్న బ్లాక్ ఫంగస్
- ఇప్పటి వరకు 126 మంది మృతి
- మహారాష్ట్రలో ప్రాణాలు కోల్పోయిన 90 మంది
ఓవైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే... మరోవైపు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. నానాటికీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు 5,500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 126 మంది చనిపోయారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మరోవైపు, మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలోనే ఫంగస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఫంగస్ బారిన పడి మహారాష్ట్రలో ఇప్పటి వరకు 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే కొన్ని రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ కేసులు, మరణాలను నమోదు చేయకపోవడం వల్ల... ఈ వ్యాధికి సంబంధించి పక్కా డేటా తెలియడం లేదని జాతీయ మీడియా తెలిపింది. అన్ని రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా పరిగణించాలని... రోగులకు అత్యవసర చికిత్స అందించాలని నిన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే లిపోసోమల్ యాంపొటెరిసిస్ బి ఇంజెక్షన్ కొరత ఏర్పడుతోంది. ఈ కొరతను అధిగమించేందుకు మరో 5 ఫార్మా కంపెనీలకు అనుమతులిచ్చినట్టు కేంద్రం ప్రకటించింది.