Nalgonda District: పెళ్లికి అంగీకరించలేదని.. ప్రేయసిని బీరు బాటిల్‌తో పొడిచి చంపిన యువకుడు

Man murdered lover with Beer Bottle in Nalgonda
  • నల్గొండలోని నాగార్జున సాగర్‌లో ఘటన
  • అడవిలోకి తీసుకెళ్లి బీరు బాటిల్‌తో గొంతులో పొడిచి హత్య
  • తాగిన మత్తులో మృతదేహం పక్కనే నిద్ర
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై బీరుబాటిల్‌తో  దాడి చేసి హతమార్చాడో కిరాతకుడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంపోడు మండలం బొల్లారానికి చెందిన చందన (20) ఇంటర్ వరకు చదువుకుంది. ఇంటి వద్దనే ఉంటూ కూలిపనులకు వెళ్తోంది. అనుముల మండలం కొరివేనిగూడేనికి చెందిన బొడ్డు శంకర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం వరికోత మిషన్‌పై పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో నెలన్నర క్రితం వరికోతల కోసం బొల్లారం వెళ్లిన శంకర్‌కు చందనతో పరిచయం ఏర్పడింది. ఇది మరింత ముదిరి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి గురించి మాట్లాడేందుకు నిన్న మధ్యాహ్నం బైక్‌పై  ఇద్దరూ సాగర్ బయలుదేరారు. మార్గమధ్యంలో హిల్ కాలనీ రెండో డౌన్ వద్ద శివం హోటల్ సమీపంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.

అక్కడ వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగిన శంకర్.. అనంతరం చందనతో కలిసి భోజనం చేశాడు. ఈ సందర్భంగా శంకర్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందుకు చందన నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది మరింత ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్ బీరు బాటిల్ పగలగొట్టి ఆమె గొంతులో పొడిచాడు. అనంతరం బండరాయితో తలపై మోదాడు. దీంతో ఆమె అక్కిడికక్కడే మృతి చెందింది.

మద్యం మత్తులో ఉన్న శంకర్ ఆమెను హత్య చేసిన అనంతరం అక్కడే చెట్టు కింద నిద్రపోయాడు. సాయంత్రం నిద్రలేచి రోడ్డుపైకి చేరుకున్నాడు. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న పోలీసులు అతడిని ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
Nalgonda District
Nagarjuna Sagar
Lover
Murder
Crime News

More Telugu News