COVID19: బ్లాక్ ఫంగస్ బాధితులలో పురుషులే ఎక్కువట!
- నలుగురు భారత వైద్యుల అధ్యయనంలో వెల్లడి
- బాధితుల్లో 79 శాతం మంది వారేనని గుర్తింపు
- మధుమేహం, స్టెరాయిడ్లు వాడడం వల్లే ముప్పు
దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులూ ఎక్కువైపోతున్నాయి. అయితే, బాధితుల్లో ఎక్కువ మంది పురుషులే ఉంటున్నారని నలుగురు భారత వైద్యుల బృందం అధ్యయనంలో తేలింది. కోల్ కతాలోని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్ లో విధులు నిర్వర్తించే డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్, డాక్టర్ రీతూ సింగ్ , ముంబైలోని లీలావతి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శశాంక్, ఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్, ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రాలు.. 101 మంది బ్లాక్ ఫంగస్ బాధితులపై అధ్యయనం చేశారు.
వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ తీరును పరిశీలించారు. బాధితుల్లో 79 శాతం మంది మగవారే ఉన్నారని గుర్తించారు. ప్రతి వందలో 31 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చనిపోతున్నారని తేల్చారు. 60 శాతం మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు, 41 శాతం మంది కోలుకున్నారని చెప్పారు. 83 శాతం మందికి మధుమేహం ఉందని, మూడు శాతం మందికి కేన్సర్ ఉందని నిర్ధారించారు. 76 శాతం మంది కార్టికో స్టెరాయిడ్లు వాడుతున్నారని డాక్టర్ శశాంక్ వివరించారు.
21 శాతం మందికి రెమ్ డెసివిర్, 4 శాతం మంది టొసిలిజుమాబ్ ను వాడారని చెప్పారు. తక్కువ ఆక్సిజన్, ఎక్కువ చక్కెర, స్టెరాయిడ్ల వాడకంతో తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోందని వైద్యుల అధ్యయనం తేల్చింది.