Narendra Modi: ప్రధాని ఏరియల్ సర్వే వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు: ఉద్ధవ్ థాకరే విమర్శలు
- వరద ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే చేశారు
- గ్రౌండ్ లో ఆయన పర్యటించలేదు
- థాకరే వ్యాఖ్యలపై బీజేపీ నేతల విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. తౌతే తుపాను నేపథ్యంలో గుజరాత్ లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించిన నేపథ్యంలో థాకరే మాట్లాడుతూ... ఏరియల్ సర్వే చేస్తూ ఆయన ఫొటోలు దిగారని... దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. గ్రౌండ్ లో పర్యటిస్తూ జరిగిన నష్టాన్ని పరిశీలించినట్టైతే బాగుండేదని అన్నారు. రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో పర్యటన సందర్భంగా థాకరే మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు థాకరే వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ నేతలు మండిపడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో థాకరే కేవలం మూడు గంటలు మాత్రమే పర్యటించి... మరోపక్క మోదీపై విమర్శలు గుప్పించారని దుయ్యబట్టారు. కేవలం మూడు గంటల పర్యటనలోనే థాకరేకు వరద పరిస్థితి పూర్తిగా అర్థమయిందా? అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై థాకరే స్పందిస్తూ... తాను కనీసం మూడు గంటలైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో నడిచానని.. నష్టం గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. మోదీ మాదిరి హెలికాప్టర్ లో గాల్లో తిరిగి తాను వెళ్లిపోలేదని అన్నారు. హెలికాప్టర్ లో తిరుగుతున్న మోదీని ఎవరో ఫొటో తీశారని... నా ఫొటోను నేనే సెల్ఫీ తీసుకున్నానని చెప్పారు.