Arvind Kejriwal: వ్యాక్సిన్ కోసం కేంద్రానికి కీలక సూచనలు చేసిన కేజ్రీవాల్

Arvind Kejriwal gives Suggestions For Centre on Vaccination

  • 44 ఏళ్లలోపు వారికి కేంద్రం వ్యాక్సినేషన్ ను ఆపేసింది
  • ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలి
  • కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేసే అవకాశాన్ని అన్ని వ్యాక్సిన్ కంపెనీలకు ఇవ్వాలి

కరోనా వ్యాక్సిన్ కోసం దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. మండుటెండల్లో గంటల సేపు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు సూచనలు చేశారు.

వ్యాక్సిన్ కొరత వల్ల 18 నుంచి 44 ఏళ్ల వయసున్న వాళ్లకు కేంద్రం వ్యాక్సినేషన్ ను నిలిపి వేసిందని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. 44 ఏళ్లలోపు వారి కోసం ఇంతకు ముందు పంపిన వ్యాక్సిన్లను వారికే వాడాలని కేజ్రీ అన్నారు. ఆ డోసుల్లో ఏమైనా మిగిలితే... సాయంత్రం సమయంలో వాటిని ఇతరులకు వినియోగించాలని చెప్పారు. దీని గురించి కేంద్రానికి తాము ఇప్పటికే లేఖ కూడా రాశామని అన్నారు.

ఇప్పటి వరకు తాము 50 లక్షల డోసులు వేశామని... ఇంకా తమకు కనీసం 2.5 కోట్ల డోసులు కావాలని కేజ్రీ అన్నారు. ఇంకా ఎన్ని కరోనా వేవ్ లు వస్తాయోననే ఆందోళన తమకు ఉందని... ఇంకెన్ని ప్రాణాలు కోల్పోవాలో అనే భయాందోళనలను వ్యక్తం చేశారు.

భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ టీకాను దేశంలోని అన్ని వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి చేయాలని కేజ్రీ సూచించారు. 24 గంటల్లో దీనికి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశీ వ్యాక్సిన్ తయారీదారులకు కూడా 24 గంటల్లో అనుమతులు ఇవ్వాలని సూచించారు. విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో కేంద్రం తక్షణమే మాట్లాడాలని... వారి నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు, యూటీలు కొట్టుకుంటున్నాయని... దీనికి కేంద్రం ముగింపు పలకాలని కేజ్రీ కోరారు. కొన్ని దేశాలు వారికి అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్లను సమకూర్చుకున్నాయని... వారి దగ్గరున్న మిగులు వ్యాక్సిన్లను మనకు పంపించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని చెప్పారు. భారత్ లో వ్యాక్సిన్ తయారుచేసేందుకు అంతర్జాతీయ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News