Vijayawada: కర్ఫ్యూ సమయంలో అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దు: విజయవాడ పోలీస్ కమిషనర్ వార్నింగ్
- కర్ఫ్యూ టైమ్ లో ఎవరూ బయటకు రావొద్దు
- అత్యవసర పనులు ఉంటేనే బయటకు రండి
- అనవసరంగా తిరిగే వారిపై చర్యలు తీసుకుంటాం
కర్ఫ్యూ సమయంలో కూడా అనవసరంగా రోడ్లపైకి ఎంతో మంది వస్తుండటంపై విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన బందరు రోడ్, గాంధీనగర్, పోలీస్ కంట్రోల్ రూమ్, బీఆర్టీఎస్ రోడ్, ఏలూరు రోడ్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతున్న తీరును పరిశీలించారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వారికి దగ్గరుండి జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు. అత్యవసరమైన పనులుంటే తప్ప బయటకు రావద్దని సూచించారు. అనవసరంగా వచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యాక్సిన్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్ఫ్యూ కారణంగా కరోనా కేసులు కొంత మేర తగ్గాయని తెలిపారు. మరోవైపు కర్ఫ్యూ టైమ్ లో బయటకు వచ్చిన దాదాపు 35 వేలకు పైగా వాహనాలను విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో స్వాధీనం చేసుకున్నారు.