IMF: భారత్ లో రానున్న కాలం మరింత దారుణంగా ఉండొచ్చు: ఐఎంఎఫ్
- భారత్ లో కరోనా ఉగ్రరూపం
- ఆందోళన వ్యక్తం చేసిన ఐఎంఎఫ్
- భారత్ లో మరణాలు పెరిగే అవకాశం ఉందని వెల్లడి
- ఇతర దేశాలకు ఇది హెచ్చరిక అంటూ వ్యాఖ్యలు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో రానున్న కాలం మరింత దారుణంగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. 2021 చివరికల్లా భారత్ లో వ్యాక్సినేషన్ శాతం 35 లోపే ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారత్ 60 శాతం మందికి వ్యాక్సిన్ అందించాలంటే 100 కోట్ల డోసులు అవసరం అని అభిప్రాయపడింది.
మున్ముందు ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ఆక్సిజన్, పడకలు, ఔషధాలు లేక మరణాలు పెరగొచ్చని వెల్లడించింది. భారత్ లో నెలకొన్న పరిస్థితులు తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరిక అని ఐఎంఎఫ్ పేర్కొంది. వ్యాక్సిన్ల ఎగుమతులపై అడ్డంకులను భారత్ తొలగించాలని స్పష్టం చేసింది.