Lav Agarwal: దేశంలో కేవలం 7 రాష్ట్రాల్లోనే 10 వేలకు పైన కరోనా కేసులు నమోదవుతున్నాయి: కేంద్రం
- కొత్త కేసులు, బ్లాక్ ఫంగస్ పై లవ్ అగర్వాల్ వ్యాఖ్యలు
- 6 రాష్ట్రాల్లో అత్యధికంగా మరణాలు
- 93 జిల్లాల్లో తగ్గుతున్న పాజిటివిటీ రేటు
- ఆంఫోటెరిసిన్ బి ఔషధం అధిక ఉత్పత్తికి చర్యలు
- మరో 5 ఫార్మా సంస్థలకు అనుమతి
దేశంలో కరోనా కేసుల సరళిపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వివరాలు తెలిపారు. దేశంలో కేవలం 7 రాష్ట్రాల్లోనే 10 వేలకు పైన కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. మరో రాష్ట్రాల్లో 5 వేల నుంచి 10 వేలకు మధ్యన పాజిటివ్ కేసులు వస్తున్నాయని వివరించారు. 6 రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలో కరోనా మరణాలు అధికంగా నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 93 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతున్నట్టు గుర్తించామని చెప్పారు.
ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంఫోటెరిసిన్ బీ ఔషధానికి డిమాండ్ అధికం అవుతుండడంపైనా లవ్ అగర్వాల్ స్పందించారు. ఆంఫోటెరిసిన్ బి ఔషధం లభ్యత నిన్నటివరకు దేశంలో పరిమితంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఔషధ లభ్యత, సరఫరాను పెంచుతున్నామని స్పష్టం చేశారు.
అదనంగా మరో 5 సంస్థలకు ఆంఫోటెరిసిన్ బి ఔషధం ఉత్పత్తి చేసేందుకు లైసెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై ఫార్మా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంఫోటెరిసిన్ బి ఔషధాన్ని తయారుచేస్తున్న కంపెనీలు మరింత ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయని వివరించారు.