Food Delivery Boys: ఫుడ్ డెలివరీ బాయ్స్ ను అడ్డుకున్న హైదరాబాద్ పోలీసులు... ఆందోళనకు దిగిన జొమాటో, స్విగ్గీ సిబ్బంది
- తెలంగాణలో లాక్ డౌన్ అమలు
- నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
- ఎక్కడికక్కడ ఫుడ్ డెలివరీ బాయ్స్ నిలిపివేత
- బైకుల స్వాధీనం
- ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా
తెలంగాణలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడంతో, పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన బాయ్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. వారి బైకులను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా వడ్డించారు. దీనిపై డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు.
తాము ఆర్డర్లపై ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వస్తే తమను అడ్డుకోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఫుడ్ డెలివరీ నిలిపివేతపై తమ సంస్థల నుంచి ఎలాంటి సమాచారం లేదని, కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆర్డర్లు లేని ఫుడ్ డెలివరీ బాయ్స్ ను మాత్రమే తాము నిలిపివేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.