Yass Cyclone: యాస్ తుపాను ఎఫెక్ట్: 59 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ

59 Trains Cancelled in South Central zone
  • తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • నేడు వాయుగుండంగా మారి రేపు తుపానుగా బలపడే అవకాశం
  • సికింద్రాబాద్ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే 59 రైళ్లను రద్దు చేసింది. ఇందులో హౌరా-హైదరాబాద్ (08645), హైదరాబాద్-హౌరా   (08646), హౌరా-సికింద్రాబాద్ (02703) రైళ్లు ఈ నెల 25 నుంచి 27 వరకు నిలిచిపోనుండగా, సికింద్రాబాద్-హౌరా (02704) రైలు రేపటి నుంచి 26వ తేదీ వరకు రద్దు అయింది.  అలాగే, భువనేశ్వర్-సికింద్రాబాద్ (07015) ఈ నెల 26 నుంచి 28 వరకు రద్దు కాగా, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే రైలు (07016) 24 నుంచి 26 వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, తిరుపతి-పూరి రైలు రేపటి నుంచి 26 వరకు నిలిచిపోనుండగా,  పూరి-తిరుపతి మధ్య రైలు 26 నుంచి 28 వరకు నిలిచిపోనుంది. దీంతోపాటు గువాహటి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు, సికింద్రాబాద్ నుంచి షాలిమర్ వెళ్లే రైలు, షాలిమర్-సికింద్రాబాద్ రైళ్లు కూడా రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

కాగా, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి నేడు వాయుగుండంగా మారనుందని, రేపు తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అది తర్వాత మరింత బలపడి 25 నాటికి అతి తీవ్ర తుపానుగా మారవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Yass Cyclone
South Central Railway
Trains

More Telugu News