food delivery: తెలంగాణలో మళ్లీ ఫుడ్ డెలివరీకి అనుమతి!
- తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు కఠినతరం
- నిన్న ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకున్న పోలీసులు
- కేటీఆర్ దృష్టికి సమస్య
- కేటీఆర్ చొరవతో మళ్లీ సేవలు ప్రారంభం
తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలను కఠినతరం చేయడంతో నిన్న హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిన్న వారు నిరసన కూడా తెలిపారు. అయితే, ఫుడ్ డెలివరీ, ఈ- కామర్స్ సేవలు యథాతథంగా కొనసాగడానికి అనుమతులు వచ్చాయి. అలాగే, అత్యవసర రాకపోకలు సాగించేవారిని అడ్డుకోబోమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలకు ఆయన ఆదేశాలు జారీచేశారు. కాగా, నిన్న హైదరాబాద్‌లో పలుచోట్ల ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకోవడంతో ఈ విషయాన్ని వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అత్యవసర రాకపోకలు సాగించే వారిని అడ్డుకోవద్దని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంపై డీజీపీతో మాట్లాడతానని ట్విట్టర్‌లో చెప్పారు. దీంతో ఫుడ్ డెలివరీ, ఈ- కామర్స్ సేవలు మళ్లీ ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.