Chattishgarh: యువకుడిపై చేయి చేసుకున్న కలెక్టర్‌పై సీఎం వేటు
- లాక్డౌన్ ఉల్లంఘించాడంటూ యువకుడిపై చేయి చేసుకున్న కలెక్టర్
- కలెక్టర్ చర్య సరికాదంటూ విధుల నుంచి తొలగించిన సీఎం
- కలెక్టర్ చర్యను తీవ్రంగా ఖండించిన ఐఏఎస్ అసోసియేషన్
- క్షమాపణలు చెప్పిన కలెక్టర్ రణబీర్ శర్మ
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకుడి చెంపను ఛెళ్లుమనిపించిన సూరజ్‌పూర్ కలెక్టర్ రణబీర్ శర్మపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ చర్యలు తీసుకున్నారు. రణబీర్ శర్మను కలెక్టర్ పోస్టు నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ చర్యను తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి ఈ ఘటన విచారకరమన్నారు. రణబీర్‌ను తప్పించిన సీఎం ఆయన స్థానంలో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్‌కుమార్ సింగ్‌ను నియమించారు. యువకుడిపై కలెక్టర్ చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాను చుట్టేసింది.
మరోవైపు, రణబీర్ ప్రవర్తనను ఐఏఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ సమర్థనీయం కాదంటూ ట్వీట్ చేసింది. సేవ, నాగరికత ప్రాథమిక సిద్ధాంతాలకు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. కాగా, కలెక్టర్ రణబీర్ శర్మ ఆ తర్వాత తన ప్రవర్తనకు క్షమాపణలు తెలిపారు.