ISI: ఐఎస్ఐతో సంబంధాలు.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల అరెస్ట్
- ఇండోర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో స్నేహం
- పాక్ రహస్య సమాచారం చేరవేశారన్న ఆరోపణ
పాకిస్థాన్ కు రహస్య సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ అధికారిక గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చెందిన వ్యక్తులతో ఏడాది కాలంగా వారు స్నేహం చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఇండోర్ లోని డాక్టర్ అంబేద్కర్ నగర్ (మహూ)కు చెందిన ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పోలీసులు, మిలటరీ నిఘా విభాగం అధికారులు విచారిస్తున్నారు. పాకిస్థాన్ కు చెందిన వారి వివరాలను రాబడుతున్నారు. ఆ అక్కా చెల్లెళ్లు నకిలీ ఖాతాలు సృష్టించి సోషల్ మీడియాలో.. ఐఎస్ఐకి చెందిన వారితో టచ్ లో ఉంటున్నారని చెప్పారు. వారి దగ్గర్నుంచి ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
నిఘా అధికారులు, స్థానిక పోలీసులు కలిసి విచారణ జరపుతున్నట్టు ఇండోర్ ఇన్ స్పెక్టర్ జనరల్ హరి నారాయణ్ చారి మిశ్రా వెల్లడించారు. పాకిస్థానీలతో టచ్ లో ఉన్నారన్న పక్కా సమాచారంతోనే వారిని అరెస్ట్ చేశామన్నారు. ఆ వ్యక్తులను మొహ్సిన్ ఖాన్, దిలావర్ తదితరులుగా గుర్తించారు. వారంతా ఐఎస్ఐ రిటైర్డ్ అధికారులు అయి ఉండొచ్చని లేదా నేవీ, ఆర్మీల్లో ప్రస్తుతం పనిచేస్తూ ఉండొచ్చని నిఘా విభాగం అధికారులు అనుమానిస్తున్నారు. మౌ కంటోన్మెట్ కు సంబంధించిన వివరాలను చేరవేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పరిచయమైన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకున్నానని అరెస్టయిన మహిళల్లో ఒకరు చెప్పారని అధికారులు అంటున్నారు. అక్కాచెల్లెళ్లలో అక్క అయిన మహిళ గత ఏడాది ఫేస్ బుక్ లో పాకిస్థాన్ వ్యక్తితో స్నేహం చేసిందని, అది వాట్సాప్ వరకు వచ్చిందని వివరించారు. ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడుకునేవారని చెప్పారు.
పెద్దమ్మాయి ఓ విద్యుత్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ గా, చిన్నమ్మాయి స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. చిన్నమ్మాయి తరచూ ఆర్మీ ఉండే చోట బైక్ పై తిరిగేదని అధికారులు చెబుతున్నారు. కాగా, వారిద్దరి తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారని అంటున్నారు.