Soumya Santosh: హమాస్ దాడుల్లో మరణించిన సౌమ్య సంతోష్ కు ఇజ్రాయెల్ గౌరవ పౌరసత్వం

Israel will confer Soumya Santosh with honorary citizenship

  • ఇటీవల ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దాడులు
  • రాకెట్ దాడుల్లో సౌమ్య మృతి
  • సౌమ్య స్వస్థలం కేరళ
  • ఆమెను తమలో ఒకరిగా భావిస్తున్నామన్న ఇజ్రాయెల్

ఇటీవల ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన భీకర దాడుల్లో సౌమ్య సంతోష్ అనే భారత నర్సు మృతి చెందింది. ఆమె మరణం పట్ల ఇజ్రాయెల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దేశాధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ కేరళలోని సౌమ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. తాజాగా, సౌమ్య సంతోష్ కు మరణానంతరం గౌరవ పౌరసత్వం అందించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించింది. సౌమ్య సంతోష్ తమ దేశ గౌరవ పౌరురాలు అని ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారని, ఆమెను తమలో ఒకరిగా చూసుకోవాలనుకుంటున్నారని భారత్ లో ఇజ్రాయెల్ ఉప రాయబారి రోరీ యెడీడియా పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళలోని సౌమ్య సంతోష్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. తన భార్యకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తామని ఆమె భర్త సంతోష్ తెలిపారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం అధికారులు సమాచారం అందించారని, తమ కుమారుడు అడోన్ బాధ్యతలను కూడా ఇజ్రాయెల్ స్వీకరిస్తుందని వారు భరోసా ఇచ్చారని సంతోష్ వివరించారు.

కాగా, సౌమ్య మరదలు షెర్లీ బెన్నీ కూడా ఇజ్రాయెల్ లోనే పనిచేస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, సౌమ్యను ఇజ్రాయెల్ ప్రజలు ఓ దేవతగా భావిస్తున్నారని తెలిపారు. ఆమె ప్రాణత్యాగాన్ని గౌరవించాలని వారు నిర్ణయించుకున్నారని వెల్లడించారు. విదేశాల్లో మరణించిన ఓ భారత జాతీయురాలికి లభించిన గొప్పగౌరవం ఇదని వివరించారు.

  • Loading...

More Telugu News