Kakani Govardhan Reddy: ఆనందయ్యను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?: ఎమ్మెల్యే కాకాణి
- ఆనందయ్య మందుపై కాకాణి స్పందన
- ఆనందయ్యను ఎవరూ అరెస్ట్ చేయలేదని వెల్లడి
- మందుపై అధ్యయనం జరుగుతోందని వివరణ
- ప్రభుత్వ విధివిధానాలు వస్తే పంపిణీ ఉంటుందని స్పష్టీకరణ
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆనందయ్య కరోనా మందు అంశంపై స్పందించారు. ఆనందయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఆనందయ్యను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
గత కొన్నిరోజుల వరకు ఆనందయ్య మందు కోసం జనాలు ఎగబడ్డారని కాకాణి వెల్లడించారు. అయితే, ప్రస్తుతం మందుపై అధ్యయనం జరుగుతోందని, ప్రభుత్వ విధివిధానాలు వచ్చిన తర్వాతే మందు పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల డిమాండును బట్టి పెద్ద ఎత్తున మందు తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమది మెడికల్ మాఫియాకు లొంగే ప్రభుత్వం కాదని కాకాణి స్పష్టం చేశారు.
అటు, ఆయుష్ విభాగం ఆనందయ్య తయారుచేసే మందు ఆయుర్వేదం కాదని, నాటు మందు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆనందయ్య స్పందించారు. తనది ఆయుర్వేద మందేనని ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేసేందుకే మందు తయారుచేశానని స్పష్టం చేశారు. తమ ఔషధం పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని, ప్రభుత్వం ఏంచెబితే అది చేస్తామని పేర్కొన్నారు.
ఇక, హెడ్ మాస్టర్ కోటయ్య గురించి చెబుతూ, ఆయనకు మందు ఇచ్చి నాలుగు రోజులైందని, తన మందు వల్లే కోటయ్య ఇబ్బందిపడ్డారని చెప్పలేమని ఆనందయ్య అన్నారు. తన మందును కొందరు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలని కోరారు.