Kanna Lakshminarayana: వ్యాక్సినేషన్ ను కూడా రాజకీయం చేయడం జగన్ కే చెల్లింది: కన్నా
- గుంటూరులోని తన నివాసంలో కన్నా దీక్ష
- ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ నిరసన
- మోదీ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని వెల్లడి
- కేసీఆర్ లా జగన్ కూడా బయటికి రావాలని హితవు
ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందన్న కన్నా గుంటూరులోని తన నివాసంలో 2 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ ను కూడా రాజకీయం చేయడం జగన్ కే చెల్లిందని అన్నారు.
వ్యాక్సినేషన్ కోసం కేంద్రం రూ.35 వేల కోట్లు కేటాయించిందని, మరి కేంద్రాన్ని జగన్ ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సినేషన్ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు జరుగుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు.
కరోనా సెకండ్ వేవ్ పై ప్రధాని మోదీ ఎప్పుడో హెచ్చరికలు చేశారని, కానీ ఏపీ సర్కారు ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆరోపించారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ బయటికి వచ్చి కరోనా పరిస్థితులు తెలుసుకున్నారని, ఆయన తరహాలోనే ఏపీ సీఎం జగన్ కూడా తన నివాసం నుంచి బయటికి వచ్చి కరోనా రోగుల బాగోగులు తెలుసుకోవాలని కన్నా హితవు పలికారు.