Asia Cup: ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీ వాయిదా
- 2023కి ఆసియా కప్ వాయిదా
- కరోనా కారణంగా మారిన షెడ్యూళ్లు
- వచ్చే ఏడాది వరకు బిజీగా ఆసియా జట్లు
- టోర్నీ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన ఏసీసీ
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి క్రీడారంగంపైనా పెను ప్రభావం చూపుతోంది. ఒలింపిక్స్ వంటి విశ్వ క్రీడా సంరంభం కూడా జరుగుతుందో, జరగదో తెలియని పరిస్థితి ఏర్పడింది. అటు, క్రికెట్ పోటీలను సైతం కరోనా మహమ్మారి శాసిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్ అర్ధంతరంగా ముగియగా, ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీపైనా కరోనా ప్రభావం పడింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు తమ షెడ్యూళ్లను మార్చుకోవడంతో, 2021 క్యాలెండర్ లో ఆసియా కప్ కు స్థానం కల్పించడం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కు శక్తికి మించిన పనైంది. ఆసియాలో అగ్ర క్రికెట్ జట్లయిన టీమిండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు ఊపిరి సలపనంతగా అనేక సిరీస్ లు ఆడనున్నాయి. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2022లో కూడా ఆసియా కప్ జరగనుండడంతో, ఈ ఏడాది జరపాల్సిన ఆసియా కప్ ను 2023కి వాయిదా వేశారు.
ఆసియా కప్ ను రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. వివిధ కారణాలతో 2018 నుంచి ఆసియా కప్ నిర్వహణ సాధ్యం కావడంలేదు. 2020లో నిర్వహిద్దామని అనుకుంటే కరోనా ఫస్ట్ వేవ్ అందుకు గండికొట్టింది. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఆసియా కప్ కు అవాంతరాలు సృష్టిస్తోంది.