Rains: యాస్ ఎఫెక్ట్: ఏపీలో మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో వర్షాలు

Rain alert for AP in the wake of cyclone Yaas
  • తూర్పు తీరం దిశగా దూసుకొస్తున్న యాస్ తుపాను
  • ఈ నెల 26న తీరం చేరనున్న యాస్
  • ఏపీపైనా ప్రభావం
  • దక్షిణకోస్తాలో భారీ వర్షాలు
  • రాయలసీమలో తేలికపాటి వర్షాలు
  • గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను తీరం దిశగా దూసుకువస్తోంది. యాస్ తుపాను రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా, ఆపై అతి తీవ్ర తుపానుగా బలపడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం యాస్ ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయదిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 26 మధ్యాహ్నం పరదీప్, సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది.

ఇక యాస్ తుపాను ప్రభావంతో ఏపీలో రాగల మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తుపాను తీరం దాటేటప్పుడు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంటుందని వివరించింది. యాస్ తుపాను తీవ్రత కారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. సముద్ర తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది.
Rains
Andhra Pradesh
Cyclone Yaas
Bay Of Bengal

More Telugu News