AiG: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

AIG chairman Dr Nageshwar Reddy wins Rudolf V Schindler award

  • 2021 ఏడాదికి గాను డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డు
  • ఏఎస్‌జీఈ చీఫ్ డాక్టర్ క్లాస్ మెర్జెనర్ నుంచి అవార్డు స్వీకరణ
  • ఎండోస్కోపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడిన మెర్జెనర్
  • నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరకే అందించే లక్ష్యంతో సాగుతానన్న డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్, జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో విశిష్ట సేవలు అందించే వైద్య నిపుణులకు ప్రతి ఏటా అందించే పురస్కారం ఈసారి నాగేశ్వర్‌రెడ్డికి దక్కింది. అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్ వ్యవస్థాపకుడు, ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీగా గౌరవించే డాక్టర్ రుడాల్ఫ్ వి. షిండ్లర్ పేరిట అమెరికన్ సొసైటీ ఫర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ (ఏఎస్‌జీఈ) సంస్థ ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తుండగా 2021 సంవత్సరానికి గాను నాగేశ్వర్‌రెడ్డికి ఈ పురస్కారం దక్కింది.

ఆదివారం రాత్రి వర్చువల్‌గా జరిగిన సదస్సులో ఏఎస్‌జీఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా మెర్జెనర్ మాట్లాడుతూ.. ఎండోస్కోపీ విధానంలో అందిస్తున్న అధునాతన వైద్యసేవలు, పరిశోధన, సునిశిత బోధన, అంతర్జాతీయ భాగస్వామ్యంతోపాటు మార్గదర్శకుడిగా నిలిచినందుకు గుర్తింపుగా ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎండోస్కోపీ చికిత్సలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.

తనకు దక్కిన ఈ గౌరవంపై డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ జీర్ణకోశ వ్యాధి నిపుణులకు ఒక కల అయిన ఈ అవార్డును పొందడాన్ని తాను అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. రంగమేదైనా చిత్తశుద్ధి, పట్టుదల, అంకితభావంతో కష్టపడితే దేశంతో సంబంధం లేకుండా గుర్తింపు దానంతట అదే వస్తుందని, అందుకు ఈ అవార్డే ఉదాహరణ అని అన్నారు. నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరకే అందించాలన్న లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

  • Loading...

More Telugu News