Chandrababu: అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి.. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
- బీసీ జనార్దన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు
- జనార్దన్ అనుచరులను ఇంతవరకు కోర్టులో హాజరుపర్చలేదు
- నిబంధనలకు విరుద్ధంగా అదుపులో ఉంచుకోవడం ఉల్లంఘనే
- అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామన్న చంద్రబాబు
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. జనార్దన్ అనుచరులను ఇంతవరకు కోర్టులో హాజరుపర్చలేదని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అదుపులో ఉంచుకోవడం ఉల్లంఘనే అని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ జనార్దన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు.
ఇదే విషయంపై టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అక్రమ కేసులతో వేధించడమే వైసీపీ పనిగా మారిందని విమర్శించారు. జనార్దన్ రెడ్డి ఇంటిపైకి కొందరు దాడికి వచ్చారని, తిరిగి జనార్దన్ పైనే కేసులు పెట్టడం ఏంటీ? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని నిలదీశారు. జనార్దన్ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.