Nara Lokesh: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ అమిత్ షాకు లేఖ రాసిన నారా లోకేశ్

Nara Lokesh wrote Amit Shah to cancel Tenth and Inter exams in AP
  • ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు జరుపుతున్నారన్న లోకేశ్
  • విద్యార్థులను సూపర్ స్ప్రెడర్లుగా మార్చుతున్నారని వ్యాఖ్య
  • సీబీఎస్ఈ విధానాన్ని ఏపీ సర్కారు పాటించాలని వెల్లడి
  • కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పది, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దేశంలో 14 రాష్ట్రాలు పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకున్నాయని, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి బోర్డులు కూడా పరీక్షలు రద్దు చేశాయని లోకేశ్ ప్రస్తావించారు. కానీ, ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయని ఆరోపించారు.

జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వేలాది పరీక్ష కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. అటు, 5 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తమ పరీక్షలపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఈ రెండు తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని, పరీక్షల వంకతో మరింతమందిని కరోనా సెకండ్ వేవ్ కు పణంగా పెట్టడం తగదని లోకేశ్ పేర్కొన్నారు. కొవిడ్ తీవ్రంగా ఉన్న స్థితిలో పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను సూపర్ స్ప్రెడర్లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని లోకేశ్ తన లేఖలో విమర్శించారు.

పది, ఇంటర్ పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అవలంబిస్తున్న విధానాన్నే ఏపీ సర్కారు కూడా పాటించేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆందోళనలను కూడా గమనించి, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని లోకేశ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Nara Lokesh
Amit Shah
Tenth Class
Inter
Exams
COVID19
YSRCP
Andhra Pradesh

More Telugu News