Jagan: యాస్ తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
- బంగాళాఖాతంలో యాస్ తుపాను
- తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ అంచనా
- ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం
- విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపైనా ఉండొచ్చన్న వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. యాస్ తుపాను ప్రభావంపై విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తుపాను తీరం దాటే వరకు కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ వర్చువల్ సమావేశానికి శ్రీకాకుళం జిల్లా నుంచి హాజరయ్యారు. శ్రీకాకుళంలో అక్కడక్కడా జల్లులు తప్ప యాస్ తుపాను ప్రభావం పెద్దగా కనిపించలేదని ఆయన సీఎంకు వివరించారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని, విద్యుత్ కు అంతరాయం లేకుండా జనరేటర్లు, డీజిల్ సిద్ధం చేశామని తెలిపారు.
యాస్ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. యాస్ తుపాను రేపు పారాదీప్, బెంగాల్ లోని సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనుంది.