Hyderabad: ఇతర నగరాల కంటే హైదరాబాదులోనే కరోనా కేసులు తక్కువ: పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
- నగరంలో మరణాల రేటు కూడా తక్కువగా ఉంది
- అనవసరంగా రోడ్లపైకి రావొద్దు
- రోజుకు 8 వేల మందిపై కేసులు నమోదవుతున్నాయి
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాదులో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. ప్రజలంతా మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ పాటిస్తే... ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈరోజు ఆయన ఈస్ట్ జోన్ పరిధిలోని అంబర్ పేట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈస్ట్ జోన్ పరిధిలో 25 చెక్ పోస్టులు ఉన్నాయని... జాయింట్ సీపీ రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. కేవలం ఎమర్జెనీ వాహనాలు, ముందస్తు అనుమతులు ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు ఎంతో మంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని... రోజుకు సరాసరి 8 వేల మందిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈ-పాస్ లను దుర్వినియోగం చేస్తున్నవారు కూడా చాలా మంది ఉన్నారని అన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.