Bharat Biotech: కోవాగ్జిన్ 30 రోజుల్లో 30 నగరాలకు చేరింది: వ్యాక్సిన్ కొరతపై భారత్ బయోటెక్ స్పందన
- వ్యాక్సిన్ తయారీ కోసం 24 గంటలూ పని చేస్తున్నాం
- దేశం కోసం నిబద్ధతతో పని చేస్తున్నాం
- మా ఉద్యోగులు కూడా కొందరు క్వారంటైన్ లో ఉన్నారు
ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కు తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ... ఆ వ్యాక్సిన్ ఎంతో మందికి అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ స్పందిస్తూ... గత 30 రోజుల్లో తమ వ్యాక్సిన్ 30 నగరాలకు చేరిందని తెలిపింది.
వ్యాక్సిన్ తయారీ కోసం తమ ఉద్యోగులందరూ 24 గంటలూ పని చేస్తున్నారని... లాక్ డౌన్ ను కూడా పట్టించుకోవడం లేదని చెప్పింది. దేశం కోసం, దేశ ప్రజల కోసం తామంతా ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపింది. అయితే కొంత మంది ఉద్యోగులు కరోనా బారిన పడి క్వారంటైన్ లో ఉన్నారని... వారి కోసం అందరూ ప్రార్థించాలని కోరింది.
మరోవైపు భారత్ బయోటెట్ జేఎండీ సుచిత్ర ఎల్లా గత వారం మాట్లాడుతూ, వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. గుజరాత్ లోని ఓ ప్లాంట్ లో ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఏడాదికి 20 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.