Andhra Pradesh: ఏపీలో కొత్త కేసులు తగ్గుతున్నా... మరోసారి వందకు పైనే మరణాలు
- ఒక్కరోజులో 106 మంది మృతి
- చిత్తూరు జిల్లాలో 15 మంది కన్నుమూత
- గత 24 గంటల్లో 72,979 కరోనా పరీక్షలు
- 15,284 మందికి పాజిటివ్
- కోలుకున్న వారు 20,917 మంది
ఏపీలో కరోనా మరణాల సంఖ్య మరోసారి వందకు పైనే నమోదైంది. ఒక్కరోజులో 106 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది చనిపోగా, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,328కి చేరింది.
అయితే, ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండడం ఆశాజనక పరిణామం అని చెప్పవచ్చు. గడచిన 24 గంటల్లో 72,979 కరోనా పరీక్షలు నిర్వహించగా... 15,284 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,663 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,970 కేసులు, విశాఖ జిల్లాలో 1,840 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కడప జిల్లాలో 436 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది.
అదే సమయంలో 20,917 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,09,105 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,00,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,98,023 మందికి చికిత్స జరుగుతోంది.