Cyclones: మొన్న తౌతే, నేడు యాస్... రాబోయే తుపానులకు కూడా పేర్లు సిద్ధం!
- కొన్నాళ్లుగా తుపానులకు పేర్లు పెట్టే కార్యాచరణ
- తౌతే అని నామకరణం చేసిన మయన్మార్
- యాస్ అని పేరుపెట్టిన ఒమన్
- ఈసారి తుపానుకు పాక్ నామకరణం
- గులాబ్ అని పిలవనున్న వైనం
గత కొన్నేళ్లుగా ఆసియా ప్రాంతంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం కొనసాగుతోంది. ఇటీవలే అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు తౌతే అని, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు యాస్ అని నామకరణం చేశారు. ఇవేకాదు, మున్ముందు ఏర్పడే తుపానులకు కూడా పేర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ), ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ (ఈఎస్ సీఏపీ) తుపానుల పేర్ల జాబితాలను నిర్వహిస్తూ ఉంటాయి.
ఈ తుపానులకు పేర్లు పెట్టే అవకాశం ఆయా దేశాలకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వంతులవారీగా వస్తుంటుంది. దాని ప్రకారమే ఇటీవల మయన్మార్ తౌతే అని పేరుపెట్టగా, ఒమన్ యాస్ అని నామకరణం చేసింది. యాస్ అంటే పర్షియా భాషలో మల్లెపువ్వు అని అర్థం. ఇక తదుపరి తుపానుకు పేరుపెట్టే వంతు పాకిస్థాన్ ది కాగా, ఆ దేశం సూచించిన గులాబ్ అనే పేరు ఇప్పటికే రిజిస్టర్ అయింది. ఆ తర్వాత సంభవించే తుపానును ఖతార్ సూచించిన షహీన్ అనే పేరుతో పిలుస్తారు.