KTR: జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మెను విరమించాలి.. లేకపోతే చర్యలు తప్పవు: కేటీఆర్ హెచ్చరిక
- ఉదయం నుంచి జూనియర్ వైద్యుల సమ్మె ప్రారంభం
- రేపటి నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని హెచ్చరిక
- కరోనా వేళ సమ్మె చేయడం సరికాదన్న కేటీఆర్
కొంత కాలంగా తమ సమస్యల గురించి విన్నవించుకుంటున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నేటి నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవలను బంద్ చేసిన జూనియర్ వైద్యులు నిరసనలో పాల్గొంటున్నారు.
దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కరోనా వేళ సమ్మె చేయడం సరికాదని చెప్పారు. జూనియర్ వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, తమ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.