Shiv Sena: మోదీ, అమిత్ షా, యోగిలపై విరుచుకుపడిన ‘సామ్నా’
- దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంటే బీజేపీ దృష్టి యూపీపై
- ఎన్నికల్లో గెలుపు కోసం పావులు
- మోదీ, షా, యోగి రహస్య సమావేశం
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై శివసేన ‘మౌత్ పీస్’ సామ్నా తన సంపాదకీయంలో విరుచుకుపడింది. దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే బీజేపీ మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి పెట్టిందని ధ్వజమెత్తింది.
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ఓటమి తర్వాత బీజేపీ చూపు ఇప్పుడు యూపీపై పడిందని, మోదీ, షా, యోగి కలిసి రహస్య సమావేశం కూడా నిర్వహించారని పేర్కొంది. దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే బీజేపీ మాత్రం ఎన్నికలు, ర్యాలీలు, రోడ్డు షోలు, ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి పెట్టిందని దునుమాడింది.
కాగా, ఇటీవల బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న బీజేపీకి యూపీలో దెబ్బ పడింది. పంచాయతీ ఎన్నికల్లో కమలం పార్టీకి ప్రజలు షాకిచ్చారు. దీంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే శివసేన తాజాగా ఆ పార్టీపై విరుచుకుపడింది.