JUDA: ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదు: తెలంగాణ జూనియర్ డాక్టర్లు
- జూడాలతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం
- తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోలేదన్న జూడాలు
- విధుల్లో చేరాలా? వద్దా? అనే అంశంపై చర్చించుకుంటున్నామని వ్యాఖ్య
జూనియర్ డాక్టర్లతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది. టీఎస్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డితో జూడాలు సమావేశమయ్యారు. అయితే చర్చల సందర్భంగా ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూడాలు చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా లిఖితపూర్వక హామీ లభిస్తేనే తాము విధుల్లో చేరుతామని జూడాలు స్పష్టం చేశారు.
కోవిడ్ విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన వైద్య సిబ్బందికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఎక్స్ గ్రేషియా చెల్లించబోమని రమేశ్ రెడ్డి చెప్పారని తెలిపారు. కరోనా సోకిన వైద్య సిబ్బందికి గాంధీ ఆసుపత్రిలో బెడ్లు ఇచ్చే అంశం కూడా తమ పరిశీలనలో లేదని డీఎంఈ అన్నారని చెప్పారు. 10 శాతం కరోనా ఇన్సెంటివ్ లు ఇవ్వడం కూడా కుదరదన్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విధుల్లో చేరాలా? వద్దా? అనే అశంపై తాము చర్చించుకుంటున్నామని చెప్పారు.