Oxygen Beds: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు... ఓ బస్సును పరిశీలించిన మంత్రి పేర్ని నాని
- పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కొరత
- బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ
- వెన్నెల, స్లీపర్, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు
- ఒక్కో బస్సులో 10 బెడ్లు
- మున్ముందు మరిన్ని బస్సులు తెస్తామన్న పేర్ని నాని
కరోనా రోగుల సంఖ్య అధికం అవుతుండడంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వచ్చింది. కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అనుగుణంగా కొన్ని బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తోంది. ఆక్సిజన్ బెడ్లతో వెన్నెల, స్లీపర్, ఏసీ బస్సుల్లో తగిన విధంగా మార్పులు చేస్తోంది. బెడ్ల కొరత ఉన్న ప్రాంతాల్లో కరోనా రోగులకు బస్సుల్లోనే వైద్యం చేసేందుకు ఈ నిర్ణయం వీలు కల్పించనుంది.
ప్రయోగాత్మకంగా వెన్నెల స్లీపర్ బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయగా, ఆ బస్సును విజయవాడలో ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. బస్సులో తాము చేసిన ఏర్పాట్లను, ఇతర సౌకర్యాలను ఆర్టీసీ ఎండీ మంత్రికి వివరించారు.
దీనిపై పేర్ని నాని మాట్లాడుతూ, ఒక ఆర్టీసీ బస్సు ద్వారా 10 మంది కరోనా రోగులకు చికిత్స అందించే వీలుందని వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ బస్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బుట్టాయిగూడెం, కేఆర్ పురం ప్రజారోగ్య కేంద్రాల వద్ద ఈ ఆక్సిజన్ బెడ్లతో కూడిన బస్సుల ద్వారా సేవలు అందిస్తామన్నారు. ప్రస్తుతానికి 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, మున్ముందు మరిన్ని ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.