Etela Rajender: ఈటల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం!
- తెలంగాణ బీజేపీ కీలక నేతలతో జేపీ నడ్డా వర్చువల్ సమావేశం
- బీజేపీలో ఈటల చేరికపైనే ప్రధాన చర్చ
- ఈటల చేరికకు పచ్చ జెండా ఊపిన నడ్డా
గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలతో ఆయన వరుస సమావేశాలను నిర్వహించడంతో... ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై సందిగ్దత నెలకొంది. ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఆయనతో చర్చించడంతో నిన్న రాత్రికి కొంత క్లారిటీ వచ్చింది.
తాజాగా, ఆయన బీజేపీలో చేరబోతున్నారనే విషయం కన్ఫామ్ అయింది. తమ పార్టీలో ఈటల చేరేందుకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర కీలక నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు వర్చువల్ గా సమావేశమయ్యారు. బీజేపీలో ఈటల చేరికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో ఈటల చేరికకు నడ్డా పచ్చ జెండా ఊపారు. బీజేపీలో ఈటల ఎప్పుడు చేరాలనే విషయాన్ని ఆ పార్టీ రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు సమాచారం.
తేదీని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన వెంటనే ఢిల్లీకి ఈటల పయనమవనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని తెలుస్తోంది.