Raghu Rama Krishna Raju: ఎయిమ్స్ లో రఘురామకు వైద్య పరీక్షలు.. నడవడానికి వీల్లేదని చెప్పిన వైద్యులు
- బెయిల్ పై విడుదలైన రఘురామ
- ఢిల్లీలో ఎయిమ్స్ లో చేరిక
- రెండు కాళ్లకు కట్లు కట్టిన వైద్యులు
- రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని పేర్కొన్న వైద్యులు
బెయిల్ పై విడుదలైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఈ రోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కాళ్లలో కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రఘురామరాజు ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు.
రాజద్రోహం ఆరోపణలపై రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే కస్టడీలో తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ ఆరోపించడంతో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల్లో ఆయన కాలి వేలు ఫ్రాక్చర్ అయినట్టు వెల్లడైంది.
ఇక, సుప్రీంకోర్టు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామకు ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఈ కేసు గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని న్యాయస్థానం రఘురామను ఆదేశించింది.