GlaxoSmithKline: కరోనాకు మరో కొత్త టీకా.. మరో నాలుగు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న గ్లాక్సో
- ఈ ఏడాది చివరి మూడు నెలల్లో వినియోగంలోకి టీకా
- 35 వేల మంది వలంటీర్లపై మూడో దశ ప్రయోగాలు
- చైనా, దక్షిణాఫ్రికా వేరియంట్లపై ప్రభావం
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే మరో టీకా త్వరలోనే రాబోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు తాము అభివృద్ధి చేసిన టీకా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని ‘సనోఫి అండ్ గ్లాక్సో స్మిత్ క్లైన్’ సంస్థ తెలిపింది.
అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 35 వేల మంది వలంటీర్లపై మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించింది. త్వరలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొంది. తాము అభివృద్ధి చేసిన టీకా చైనా, దక్షిణాఫ్రికా వేరియంట్లపైనా ప్రభావం చూపుతుందని వివరించింది.
ఈ ఏడాది చివరి మూడు నెలల్లో తమ టీకా వినియోగంలోకి వస్తుందని తెలిపింది. తొలి దశ క్లినికల్ పరీక్షల అనంతరం టీకా వేయించుకున్న యువతలో రోగ నిరోధకశక్తి పెరిగిందని, రెండు డోసులు తీసుకున్న తర్వాత వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతున్నట్టు నిర్ధారణ అయిందని గ్లాక్సో వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధి విభాగం హెడ్ థామస్ ట్రింఫె తెలిపారు.